బిగ్ న్యూస్: జగన్ సర్కార్‌కు మరోసారి సుప్రీం కోర్టులో చుక్కెదురు..!

Thursday, September 3rd, 2020, 12:43:42 PM IST

Jagan

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురు అయ్యింది. ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం అమలుపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపించారు. ప్రతివాదులకు నోటీసులతో పాటు హైకోర్టు తీర్పుపై స్టే కూడా ఇవ్వాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.

అయితే మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన ఏమీ లేదని, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరగాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రగతిశీలమని అన్నారు. ఇదిలా ఉంటే ప్రతివాదుల తరపున న్యాయవాది శంకర్‌నారాయణ కూడా తన వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని, తెలుగు మీడియం పాఠశాలలను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని అన్నారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత స్టే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.