ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఫిర్యాదు.. ప్రివిలైజ్‌ కమిటీకి పంపిన స్పీకర్‌ తమ్మినేని..!

Tuesday, February 2nd, 2021, 12:34:14 AM IST


ఏపీలో పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మడ్డ రమేష్ కుమార్‌కు మధ్య రాజేసుకున్న రగడ ఆగడం లేదు. ఓ పక్క ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అధికారులపై చర్యలు తీసుకుంటుంటే మరోవైపు ప్రభుత్వం నిమ్మగడ్డకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న తమపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై అందిన ఫిర్యాదును స్పీకర్ తమ్మినేని ప్రివిలైజ్ కమిటీకి పంపారు. ప్రివిలైజ్ కమిటీ నివేదిక తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి సహా మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. వీరంతా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడడమే కాకుండా తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని లేఖలో పేర్కొన్నారు.