సీఎం జగన్‌కు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ.. ఏం కోరాడంటే?

Wednesday, December 30th, 2020, 08:26:53 PM IST

ఏపీ సీఎం జగన్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ నిలిపివేస్తూ జారీ చేసిన జీవోను ఆయన తప్పుపట్టారు. జీఓ నెం. 77ను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు నష్టపోతారని, ఉన్నత చదువులు చదవాలన్న పేద విద్యార్థుల ఆశలు నీరుగారిపోతాయని అన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో కీలక మార్పులు తెస్తామని చెప్పారని, మీరు తెచ్చిన మార్పు ఇదేనా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు. జగనన్న వసతి, విద్యాదీవెన పథకాలు అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.