బీసీని సీఎం చేస్తానని నేను అనలేదు.. సోము వీర్రాజు యూ టర్న్..!

Friday, February 5th, 2021, 04:05:23 PM IST

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు నిన్న మీడియాతో మాట్లాడుతూ బీసీలు అంతా తమ పార్టీతోనే ఉన్నారని, బీసీలను ముఖ్యమంత్రిని చేసే దమ్ము బీజేపీకి ఉందంటూ, త‌మ పార్టీ చెప్పినంత ధైర్యంగా టీడీపీ, వైసీపీలు బీసీనీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పగలరా అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చాంశనీయమయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే సోము వీర్రాజు యూటర్న్ తీసుకున్నారు.

నిన్న తాను మాట్లాడిన మాటల్లో బీసీని సీఎం చేస్తానని చెప్పలేదని కొందరు తన మాటలను అలా వక్రీకరించారని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, తమ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కలిసి సీఎం ఎవరనేది నిర్ణయిస్తారని సోమువీర్రాజు అన్నారు. బీసీ అయిన మోదీని బీజేపీ ప్రధానిని చేసిందని ఆ ఉద్దేశ్యంతోనే వైసీపీ, టీడీపీలు బీసీని ముఖ్యమంత్రి చేయగలరా అని ప్రశ్నించానని అన్నారు. బీజేపీ సకల జనుల పార్టీ అని, ఇందులో వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ప్రకటన చేసే అధికారం తనకు లేదని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.