లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా – సోము వీర్రాజు

Monday, March 29th, 2021, 03:18:48 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ప్రక్రియ నేపథ్యంలో అటు అధికార పార్టీ వైసీపీ కి చెందిన నేతలు బీజేపీ నేతల పై, జన సేన పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీ తీరు పట్ల, పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేయగా, అందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టి కౌంటర్ ఇచ్చారు.

అయితే తిరుపతి ఉపఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకి జనం నవ్వుకుంటున్నారు అని, ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడు అన్నట్లు నటిస్తున్నారు అని విజయసాయి రెడ్డి అన్నారు. అంతేకాక ఎవరి పాత్రల్లో వారు జీవించండి, చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి సోము వీర్రాజు స్పందించారు. మా ఊసు ఎందుకు లే విజయసాయి రెడ్డి గారూ, కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యం తో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రజలకు మేము ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజీ పువ్వులు మీకు పంపిస్తాం అని సాము వీర్రాజు అన్నారు. బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి అని అన్నారు.