వారిని వెంటనే విడుదల చేయాలి – సోము వీర్రాజు

Wednesday, September 9th, 2020, 05:00:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పలు ఘటనల పై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం అయిన సంగతి తెలిసిందే. దీని పై పెద్ద ఎత్తున ఉద్యమమే జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో అంతర్వేది లో పాల్గొన్న అనేక మంది యువకులను, మహిళలను అరెస్ట్ చేశారు అని పేర్కొన్నారు.

అయితే ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ పోలీసులను ప్రశ్నిస్తే, నినాదాలు చేశారు, అయితే నినాదాలు చేస్తే అరెస్ట్ చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. రథం దగ్ధం అయి, హిందువుల హృదయాలు గాయపడుతుంటే, రెచ్చగొడుతున్నారు అని చెబుతారా అని నిలదీశారు. రెచ్చ గొట్టేది ఎవరు? హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్నాయో లేదో ప్రభుత్వమే తేల్చుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక బీజేపీ నాయకులను గృహ నిర్భంధం లో ఉంచారు అని, వారిని వెంటనే విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.