బీజేపీ కార్యకర్తల పై కేసులు… వైసీపీ ప్రభుత్వం లక్ష్యం ఏమిటి?

Sunday, January 17th, 2021, 03:09:20 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం పట్ల డీజీపీ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విగ్రహాల ధ్వంసం వెనుక బీజేపీ నేతలు ఉన్నారు అంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యల పై విరుచుకు పడ్డారు. నిరాధార ఆరోపణలు చేసిన డీజీపీ ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. దేవాలయాల్లో విధ్వంసాలకి పాల్పడుతుంటే వాటి పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, బీజేపీ కార్యకర్తల పై కేసులు పెట్టడం దారుణం అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం లక్ష్యం ఏమిటి అని సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు. అంతేకాక హిందువుల మనోభావాలకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే అంతర్వేది లో రథం దగ్దం, రామతీర్థం లో రాముడు కి అపచారం, పలు దేవాలయాల్లో విధ్వంస ఘటనలు జరిగితే స్పందించని పోలీసులు, బీజేపీ కార్యకర్తల పై కేసులు పెట్టాం అని చెప్పడం లో డీజీపీ వైఖరి ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించారు. డీజీపీ ను సీఎం జగన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే హిందూ మత ఆస్తులను లెక్కించిన అధికారులు చర్చిల ఆస్తులు కూడా లెక్కించాలి అని అన్నారు. రాష్ట్రం లో జరుగుతున్న మత మార్పిడి లను అరికట్టాలి అని, హిందుత్వాన్ని అస్థిర పరచడమే లక్ష్యం గా ప్రభుత్వ వైఖరి ఉంది అని సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.