మూవీ రివ్యూ: “సోలో బ్రతుకే సో బెటర్”

Friday, December 25th, 2020, 06:01:15 PM IST

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా, నభా నటేష్‌ హీరోయిన్‌గా నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ కరోనా కారణంగా 8 నెలలుగా థియేటర్లు మూతపడడంతో చాలా సినిమాలు ఓటీటీలలోనే రిలీజ్ అయినా ఇన్ని రోజులు ఆగి మరీ ఈ సినిమాను ధియేటర్లలోనే రిలీజ్ చేశారు. మరి చాలా గ్యాప్ తర్వాత థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులను ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ:

ఈ రాజ్యంగం మనకు స్వేచ్చను ఇచ్చింది దానిని పెళ్ళి చేసుకుని చెడగొట్టుకోకండని, అసలు తాను పెళ్లే చేసుకోనని సోలో బ్రతుకే సో బెటర్ అని చెప్పే విరాట్(సాయి ధరమ్ తేజ్) అనూహ్యంగా తన జీవితంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో పెళ్లి చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోతాడు. అయితే పెళ్లే చేసుకోనని అంత కాన్‌ఫిడెంట్‌గా ఉన్న సాయి ధరమ్ తేజ్ అసలు పెళ్లి వరకు ఎందుకు వెళ్ళాడు? దానికి గల అసలు కారణాలేమిటి? అసలు సాయి ధరమ్ తేజ్ లైఫ్‌లోకి అమృత(నభా నటేష్) ఎలా వచ్చింది? ఈ సినిమాలో రావు రమేష్ ఎలాంటి కీ రోల్ పోశించారు? అనేది వివరంగా తెలియాలంటే ఈ సినిమాను థియేటర్ల వరకు వెళ్ళి చూడాల్సిందే.

విశ్లేషణ:

కరోనా కారణంగా చాలా రోజుల తర్వాత థియేటర్లకు వచ్చిన ఆడియన్స్‌కు ఈ సినిమా మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చిందనే చెప్పాలి. అంతేకాదు ఇన్ని రోజులు ఓటీటీలలో రిలీజ్ చేయకుండా ఆగి, మొదటగా థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు సాహసం చేయడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచి సక్సెస్ దొరికినట్టయింది. అయితే సినిమాలోకి వెళితే ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మంచి కామెడీ ట్రాక్స్ హిలేరియస్‌గా అనిపిస్తాయి. వీటితో పాటు మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న ట్విస్టులు కూడా పర్వాలేదనిపిస్తాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో సాయి ధరమ్ తేజ్ సూపర్బ్ అనే చెప్పాలి. హీరోగా ఎమోషన్స్, కామెడీ ఇలా తన వరకు పర్ఫెక్ట్ గా చేశాడు. ఇక సాయి తేజ్ డాన్స్ మరియు ఫైట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక సినిమాలో హీరోయిన్‌గా నటించిన నభా నటేష్ ఎంట్రీ ఇవ్వడానికి కాస్త లేట్ అయినప్పటికి తన రోల్ బాగా చేసింది. మంచి నాచురల్ లుక్, అద్భుతమైన నటనతో మరోసారి అందరి దృష్టిని తనవైపు లాగేసుకుందనే చెప్పాలి.

ఇదిలా ఉంటే సీనియర్ నటుడు రావు రమేష్ మరియు రాజేంద్ర ప్రసాద్‌లు ఈ సినిమాకు మంచి ప్లస్ అయ్యారని చెప్పాలి. తన కామెడీతో, టైమింగ్‌తో రావు రమేశ్ మరోసారి అందరిని ఆకట్టుకోగా, రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక భాద్యతాయుతమైన పాత్రతో అందరిని మెప్పించాడు. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు బాగానే ఉన్నా అది పూర్తిగా అందుకోలేదనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా పర్వాలేదనిపించినా సెకండాఫ్ అనుకున్నంత ఉండలేదనే చెప్పాలి. సినిమా నిడివి తక్కువే అయినా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తాయి. దీనిపై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండు అనిపించింది.

ఇక మ్యూజిక్ పరంగా చూసుకుంటె ఈ సినిమాకు థమన్ మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. కెమెరా పనితనం ఎడిటింగ్, లిరిక్స్ విజువల్ అత్యున్నత స్థాయిలో కనిపించాయి. సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. యంగ్ దర్శకుడు సుబ్బు తాను ఎంచుకున్న కథను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్‌లో ఉన్న స్టోరీ లైన్ సెకాండాఫ్‌కి వచ్చేసరికి మిస్సయ్యింది. అంతేకాకుండా మరికొన్ని ఎమోషన్స్, క్లైమాక్స్ కాస్త భిన్నంగా ఉండేలా చూసుకుని ఉంటే సినిమా అన్ని జోనర్ల ప్రేక్షకులను ఆకట్టుకుని ఉండేదని నా ఉద్దేశ్యం.

ప్లస్ పాయింట్స్:

* హీరో, హీరోయిన్ల యాక్టింగ్
* మంచి కామెడీ సన్నివేషాలు
* రావు రమేశ్ అద్భుతమైన నటన
* మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:

* సెకండాఫ్ కాస్త స్లోగా అనిపించడం
* క్లైమాక్స్‌ని మంచిగా ఫినిష్ చేయకపోవడం

తీర్పు:

ఇక మొత్తంగా “సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌నే దక్కించుకుందని చెప్పాలి. నటీ నటుల పెర్ఫామెన్స్, సినిమాలోని కామెడీ హైలెట్‌గా ఉందనే చెప్పాలి. అయితే కాస్త సెకాండాఫ్, క్లైమాక్స్ ఇంకాస్త బాగా ఉండేలా ప్లాన్ చేసుకుని ఉంటే మాత్రం సినిమాకు అదిరిపోయే క్రేజ్ లభించేది. ఇవన్ని పక్కన పెడితే ఈ సినిమా అన్ని వర్హాల ప్రేక్షకులకు నచ్చుతుందనే చెప్పాలి.

Rating: 3/5