విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన కాశీబుగ్గ ఎస్ఐ శిరీష..!

Sunday, February 7th, 2021, 02:12:32 AM IST

సినీ నటీ, బీజేపీ నాయకురాలు విజయశాంతికి కాశీబుగ్గ ఎస్ఐ కొత్తూరు శిరీష కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల పలాస మండలం అడవి కొత్తూరు వద్ద గుర్తు తెలియని అనాధ శవాన్ని పొలాల గట్లపై దాదాపు కిలో మీటర్ మేర తన భుజాలపై మోసుకెళ్ళి దహన సంస్కారాలకు అప్పచెప్పిన ఎస్ఐ శిరీషను సోషల్ మీడియా వేదికగా విజయశాంతి అభినందించిన విషయం తెలిసిందే. విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ సినిమా ప్రేరణతోనే శిరీషను పోలీస్‌ ఆఫీసర్‌ను చేశానని ఆమె తండ్రి చెప్పారు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ విజయశాంతి మొన్న ట్వీట్ చేశారు.

అయితే తాను నటించిన కర్తవ్యం సినిమా ఒక తండ్రికి ప్రేరణనిచ్చి, తన కూతురిని సమాజం మెచ్చే పోలీస్ అధికారిణిగా తీర్చిదిద్దడం తనకెంతో ఆనందం కలిగించిందని, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని విధి నిర్వహణలో ముందుకు సాగుతున్న కాశీబుగ్గ ఎస్‌ఐ కొత్తూరు శిరీషకు నా అభినందనలు అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. విజయశాంతి అభినందనలపై స్పందించిన ఎస్సై శిరీష తను ఇష్టపడే నటి తన గురించి ట్వీట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. విజయశాంతి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఎస్సై శిరీష అన్నారు.