అజయ్ షీలా ల మధ్య జగడం సోనియాకు తలనొప్పిగా మారిందా..?

Friday, February 13th, 2015, 02:22:09 PM IST


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఇక అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కాంగ్రెస్ పెద్దలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే దూషించుకోవడం మొదలుపెట్టారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ పై విరుచుకుపడ్డారు. మాకెన్ ప్రచారం నిర్వహించడంలో విఫలం అయ్యారని.. మాకెన్ విఫలం కావడం వలనే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కనీసం ఖాతా కూడా తెరవలేదని అన్నారు. ఇంతటి స్థాయిలో గతంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని అన్నారు. ఇక షీలా దీక్షిత్ అజయ్ మాకెన్ ను చూస్తుంటే జాలేస్తుందని అనడంతో వారి మధ్య పోరు తారా స్థాయికి చేరింది.

ఇక, షీలా వ్యాఖ్యలపై అజయ్ మాకెన్ స్పందించారు. షీలా దీక్షిత్ చూపించే జాలి తమకు అవసరం లేదని.. ఆమె మాటలు కట్టిపెట్టి నిశ్శబ్దంగా ఉంటే మంచిదని అన్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో… కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా.. ఇప్పుడు రాష్ట్రాలలో సైతం చిత్తుగా ఓడిపోతుండడంతో అధినేత్రి సోనియా గాంధి రంగప్రవేశం చేయక తప్పలేదు. పార్టీని సరిదిద్దాల్సిన నేతలే ఇలా వాదులాడుకోవడం తగదని ఆమె సర్దిచెప్పడంతో వార్ సద్దుమణిగింది.