విశ్లేషణ : ఆ నేతలు ఆపార్టీ వీడటానికి అవమానమే కారణమా…?

Saturday, November 9th, 2019, 08:44:37 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గత అధికార టీడీపీ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇక అప్పటినుండి కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కి గడ్డు కాలమే నడుస్తుందని చెప్పాలి. పక్కాగా చెప్పాలంటే మాత్రం టీడీపీ పరువు సమస్య గా మారిందని చెప్పాలి. పార్టీ మీద నమ్మకం లేని నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ కార్యకర్తలు, అప్పటివరకు పార్టీకి వెన్నెముకగా నిలిచినా నేతలందరూ కూడా పార్టీ వీడటానికి సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా చాలా మంది నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పి, వేరే ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఆ వలసలు కనీసం ఇప్పటికి కూడా ఆగడం లేదనే చెప్పాలి.

దానికి తోడు కేంద్రంలో వరుసగా రెండవసారి అధికారాన్ని దక్కించుకున్నటువంటి బీజేపీ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కూడా బలపడటానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందని చెప్పాలి. అందుకనే బీజేపీ నేతలందరూ కూడా టీడీపీ లో అసమ్మతిగా ఉన్నటువంటి నేతలని బీజేపీ లోకి లాక్కోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పాలి. కాగా ఈమేరకు టీడీపీ తరపున ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులందరు కూడా బీజేపీ లో చేరిపోయారు. కాగా ఇక ప్రస్తుతానికి టీడీపీ లో కొనసాగుతున్న నేతలు కూడా అధికార పార్టీ వైసీపీ లోకి కానీ, బీజేపీ లోకి కానీ చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలు స్వయంగా అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా టీడీపీ లో కీలకంగా ఒక వెలుగు వెలిగిన నేతలు వరుసగా టీడీపీ ని వదులుతున్నారు. ఈమేరకు టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవలే అధికార వైసీపీ లో చేరిపోయారు. కాగా వంశీ అలా పార్టీ మారడానికి కారణం తీవ్రమైన అవమానం అని అందరు చెప్పుకుంటున్నారు. కాగా పార్టీ లో వీరికి సముచిత న్యాయం కల్పించడం లేదని, మునుపటి ఆదరణ, బాధ్యతలు అప్పగించట్లేదని సదరు నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో అడుగుకు చేరిపోయిన పార్టీ ని మళ్ళీ బలోపేతం చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఒక రకమైన ప్రయత్నాలు చేస్తుంటే వీరు ఇలా బాధ్యతల కోసం కొట్టుకోవడం విమర్శలు చేయడం సబబు కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇకపోతే ఒక సమయంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన సభలో పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్, వల్లభనేని వంశీని పరోక్షంగా అవమానిస్తూ పలు వాఖ్యలు చేశారని, ఆ మాటలు జీర్ణించుకోలేకనే వంశీ పార్టీ వీడాడని, సీఎం జగన్ మీద ఉన్న నమ్మకంతో వైసీపీ లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇకపోతే వల్లభనేని వంశీ మీద హనుమాన్ జంక్షన్ పోలీసులు, స్థానికి ఎమ్మెర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని, వంశీ తో పాటే ఆయన అనుచరుల మీద కూడా కేసు నమోదైందని సమాచారం. కాగా ఈ మేరకు గుంటూరులో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ని వంశీ కలుసుకొని , ఆతరువాత సీఎం జగన్ ని కలుసుకొని, వైసీపీ లో చేరడానికి మార్గాన్ని సుగమం చేసుకున్నారని చెబుతున్నారు.

అంటే వంశీ పై నమోదైన కేసుల్ని తప్పిపుచ్చుకోడానికే టీడీపీ పార్టీ ని వదిలి, అధికార వైసీపీ లో చేరాడని బాగా ప్రచారం జరిగింది. ఈ సమయంలో వైసీపీ నేతలు పేర్ని నాని, కోడలి నాని కూడా వంశీ కి బాగా మద్దతు ఇచ్చారని, వారి ప్రోద్బలం వల్లే వంశీ వైసీపీ లో చేరాడని పలువురు నేతలు చెబుతున్నారు. కాగా ఈమేరకు వల్లభనేని వంశీ టీడీపీ పార్టీని వీడుతున్నాడని సామాజిక మాద్యమాల ద్వారా తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు కి పంపించారని, అయితే చంద్రబాబు మొదట వంశీ ని పార్టీ వీడకుండా ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, వంశీ వినలేదని, కాగా తనకు జరిగిన అవమానాల కారణంగానే వంశీ మనస్తాపానికి గురై పార్టీ వీడాడని చెబుతున్నారు.

కాగా టీడీపీని వీడటానికి సిద్ధంగా ఉన్న మరొక నేత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు… ఈయన పార్టీ మారుతారని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టి పుకార్లేనని గంటా చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈయన కూడా పార్టీ మారడానికి సిద్ధమైపోయారు. అయితే టీడీపీ పార్టీ అధికారాన్ని కోల్పోయాక గంటా కి పార్టీ లో సరైన ఆదరణ లేదని, కొందరు పార్టీ పెద్దలు కొన్ని సార్లు అవమానానికి గురి చేశారనే కారణంగా ఆయన కూడా పార్టీ మారుతున్నారు. అయితే గంటా కూడా వల్లభనేని వంశీ మాదిరి వైసీపీ లో చేరాడని సిద్దమవ్వగా, సీఎం జగన్ పెట్టిన కొన్ని షరతుల కారణంగా వైసీపీ లో చేరడానికి నిరాకరించి బీజేపీ లో చేరడానికి సిద్ధమయ్యారు.

కాగా గంటా శ్రీనివాసరావు బీజేపీ లోకి వస్తే ఆయనకు పార్టీలో గౌరవ ప్రదమైన బాధ్యతను అప్పగించి, పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తానని బీజేపీ పెద్దలు ఇప్పటికే గంటా తో సంప్రదింపులు జరిపారు. అయితే వారి ఆఫర్ కి ఒప్పుకున్న గంటా త్వరలోనే బీజేపీ లో చేరతారని స్పష్టంగా అర్థమవుతుంది. కాగా ఈయన తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ అధినేత కాస్త అసహనానికి గురయ్యారని సమాచారం. అయినప్పటికీ కూడా గంటా తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని స్పష్టంగా చెప్పేశారని, అతని సన్నిహిత వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. కానీ ముహూర్తం మాత్రం ఇంకా ఖరారు కాలేదంట.

కాకపోతే గంటా శ్రీనివాసరావు తో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీ లో చేరడానికి సిద్ధమయ్యారని సమాచారం. కానీ ఆ నేతలు ఎవరనేది మాత్రం తెలియడం లేదు. కానీ త్వరలోనే టీడీపీ పార్టీ అంతా ఖాళీ అవుతుందని, టీడీపీ లో కేవలం కొందరు నేతలు మాత్రమే మిగులుతారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇతర పార్టీల నుండి కూడా బీజేపీ లోకి వలసలు జరగనున్నాయని, అది అధికార వైసీపీ పార్టీ నుండి కూడా జరుగుతాయని కొందరు బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు.