నేటిఏపి స్పెషల్ : సీమాంధ్రలో అత్యల్ప మెజారిటీ సాధించిన అభ్యర్ధులు

Saturday, May 17th, 2014, 06:19:50 PM IST


రాష్ట్ర విభజన తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలే మొదటివి కావడంతో పార్టీలన్ని ఉత్సాహంగా కొత్త రాష్ట్రాన్ని ఏలుబడి చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల యుద్ధంలో పాల్గొన్నాయి. అయితే ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజలు విభజనకు కారణభూతమైందన్న ఆరోపణతో బహిష్కరించడంతో ప్రధాన పోటీ టిడిపి, బిజెపి పొత్తుకు , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్యనే జరిగింది. రసవత్తరంగా సాగిన ఈ పోరులో టిడిపి తన విజయ కేతనాన్ని ఎగురవేసింది. రెండు పార్టీల హోరాహోరీ పోరులో ఇరు పార్టీల నేతలు భారీ విజయాన్ని నమోదు చేసుకున్నట్లే అత్యల్ప తేడాతో కూడా గెలుపును సాధించారు. మరి ఆ వివరాలను ఇక్కడ విశదీకరిద్దాము.

సీమాంధ్రలో అత్యల్ప మెజారిటీ పొందిన మొదటి ఐదుగురు అభ్యర్ధులు:
1. అత్యల్ప మెజారిటీ పొందిన వారిలో మొదటగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని వైకాపా నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్ధి టిడిపినేత గంజి చిరంజీవి పై 12 ఓట్ల కనిష్ట మెజారిటీతో గెలుపొందారు.
2. రెండవ స్థానంలో శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపానేత కంబాల జోగులు తన ప్రత్యర్ధి టిడిపినేత ప్రతిభాభారతి పై 512 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
3. మూడవ స్థానంలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైకాపానేత చీర్ల జగ్గిరెడ్డి తన ప్రత్యర్ధి టిడిపినేత సత్యానందరావు పై 714 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
4. నాలుగవ స్థానంలో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైకాపా నేత అర్ కె రోజా తన ప్రత్యర్ధి టిడిపినేత ముద్దు కృష్ణమనాయుడు పై 858 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
5. ఇక ఐదవ స్థానంలో విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో టిడిపి నేత కెఎస్ఎన్ రాజు తన ప్రత్యర్ధి వైకాపానేత కరణం ధర్మశ్రీ పై 905 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

పరిశీలించి చూస్తే అత్యల్ప మెజారిటీతో గెలుపొందిన వారిలో మొదటి నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే కావడం గమనార్హం. తెలంగాణా, ఆంధ్ర ఇరు ప్రాంతాలలో కల్లా గుంటూరు జిల్లాలోనే ఈ ఎన్నికలలో 12 ఓట్ల అత్యల్ప మెజారిటీ నమోదు చేసుకుంది. మరి సరి సమానంగా సాగిన పోరులో ఆఖరుగా టిడిపి నేతలే విజయం సాధించారు. ఇకపై ఇరు పార్టీల నేతలు కల్మషాలు మాని సామరస్యంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని ఆశిద్దాం.