ఏపీ పంచాయితీ ఎన్నికల సస్పెన్షన్‌పై ఎస్ఈసీ మరో కీలక నిర్ణయం..!

Monday, January 11th, 2021, 11:22:02 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నట్టు ఏపీ ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రజారోగ్యం, కోవిడ్ వ్యాక్సినేషన్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మరోసారి హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. వ్యాక్సినేషన్ ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అవకాశాలను, ప్రభుత్వం ఎందుకు ఎన్నికలకు అడ్డుపడుతుందో వంటి అంశాలను కోర్టుకు వివరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంది.

కాగా ఏపీలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి మూడు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 5,9,13,17 తేదీలలో ఎన్నికలు జరుపుతున్నట్టు తెలిపింది. అంతేకాదు ఎన్నికల నిర్వహణ నేపధ్యంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. అయితే ఎన్నికల షెడ్యూల్‌ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దాదాపు 2 గంటల పాటు ప్రభుత్వ తరపు ఏజీ వాదనలు వినిపించడంతో ఎన్నికల షెడ్యూల్‌ను కోర్టు సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చింది.