మంత్రి పెద్దిరెడ్డికి ఎస్ఈసీ షాక్.. ఇంటికే పరిమితం చేయండంటూ ఆదేశాలు..!

Saturday, February 6th, 2021, 07:18:44 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో ప్రభుత్వంతో నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా రాష్ట్ర మంత్రిపైనే చర్యలకు ఆదేశాలు జారీచేశారు. ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ అధికారులను భయపెడుతున్నారని ఆరోపించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈ నెల 21వ తేదీ వరకు పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతం సవాంగ్‌కు ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు ఆయన్ను కనీసం మీడియాతో కూడా మాట్లాడనివ్వొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు.

అయితే ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అయితే మంత్రి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని, వైద్య సదుపాయాల కోసం వెళ్ళవచ్చని ఎస్ఈసీ ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు లాగే నిమ్మగడ్డకు కూడా పిచ్చి ముదిరిందని అన్నారు.

అంతేకాదు నిమ్మగడ్డ ఎస్ఈసీగా పనిచేయకుండా, చంద్రబాబు బంట్రోతులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రిని ఇంట్లో బంధించాలన్న ఆలోచన దుర్మార్గం అని, నిమ్మగడ్డ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు. నాకు సంబంధించిన శాఖలో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక నేను ఇంట్లో ఉంటాను, బయటా ఉంటాను ఆయన ఎవరు నాకు ఆదేశాలివ్వడానికి అని, అసలు నిమ్మగడ్డ ఆదేశాలను మేము పట్టించుకోమని అన్నారు. అయితే నిమ్మగడ్డ ఆదేశాలను గుడ్డిగా ఫాలో అయ్యి ఏకగ్రీవాలకు అడ్డంకులు సృష్టిస్తే సదరు అధికారులపై ఖచ్చితంగా చర్యలు తప్పవని మంత్రి పెద్దిరెడ్డి మరోసారి హెచ్చరించారు.