కేంద్రానికి లేఖ రాసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఏం కోరారంటే..!

Monday, January 25th, 2021, 04:12:49 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరపేందుకు సుప్రీం కోర్టు కూడా అనుమతులు ఇచ్చిందని అయితే ఎన్నికలకు కొన్ని ఉద్యోగ సంఘాలు సహకరించబోమని ప్రకటిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని అయితే అవసరమైతేనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్ర కేబినెట్‌ కార్యదర్శిని లేఖ ద్వారా కోరారు.

ఇదిలా ఉంటే పంచాయితీ ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం ఉద్యోగ సంఘాలు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. ఈ రోజు సాయంత్రం లోపు విధులలో పాల్గొనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ ఎన్‌జీవోల సంఘం ప్రకటించింది. అయితే సుప్రీం కోర్టులో ఉద్యోగులకు ఎదురుదెబ్బ తగలడంతో దాదాపు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.