ఎన్నికల వాయిదా కుదరదు.. ఏపీ సీఎస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ..!

Saturday, January 9th, 2021, 01:20:58 AM IST


ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. ఈ రోజు సీఎస్‌, పంచాయతీరాజ్‌, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు ఎస్ఈసీ నిమ్మగడ్డని కలిశారు. భేటీ అనంతరం ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్‌ఈసీకి అధికారులు లేఖ రాశారు. అయితే అధికారుల లేఖపై జవాబు ఇచ్చిన నిమ్మగడ్డ ప్రభుత్వం రాసిన లేఖలో పేర్కొన్న అంశాలన్నీ గతం నుంచి చెబుతున్నవనే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలను తన హయాంలో నిర్వహించకూడదని భావిస్తుందని, తన పదవీ విరమణ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నట్టు అర్ధమవుతుందని అన్నారు. పంచాయతీ ఎన్నికల వాయిదా వేయటం కుదరదని, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశామని, కమీషన్ సూచనను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఎస్ఈసీ అధికారులకు పంపిన లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రొసిడింగ్స్ ఇవ్వగా, ఎస్ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం కూర్చొని మాట్లాడుకోవాలని హైకోర్టు పలు సూచనలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉన్నతాధికారుల బృందం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో భేటీ అయ్యింది. కొత్త రకం కరోనా కేసులు ఏపీలో నమోదయ్యాయని, మరో పక్క వ్యాక్సినేషన్ పంపిణీ కూడా ఉన్న కారణంగా ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఉన్నతాధికారుల బృందం సీఎస్‌కు తేల్చి చెప్పింది.