ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్..!

Saturday, January 23rd, 2021, 11:20:05 AM IST

ఏపీ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి అందరూ ఊహించేదే జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నట్టుగానే అనుకున్న సమయానికి తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల నిర్వహణ కమీషన్ విధి అని, హైకోర్టు ఆదేశాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా పాటిస్తామని అన్నారు. ఎస్ఈసీకి న్యాయవ్యవస్థపై విశ్వాసం, విధేయత ఉన్నాయన్నారు.

అయితే దేశమంతటా ఎన్నికలు జరుగుతుంటే ఏపీలో వద్దనడం సరికాదని ఎస్ఈసీ నిమ్మగడ్డ అన్నారు. ఎన్నికల నిర్వహణ తన వ్యక్తిగత వ్యవహారం కాదని, ఎన్నికల సక్రమ నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. విధి లేని పరిస్థితుల్లో 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికలు వాయిదా వేయడంపై ప్రభుత్వ సూచనలు సహేతుకంగా లేవని సీఎస్ తనకు రాసిన లేఖ తనకంటే ముందుగానే మీడియాకు చేరిందన్నారు. కమీషన్ కోరినప్పుడు నిధులు సిబ్బందిని సమకూర్చే బాధ్యత ప్రభుత్వానిదే అని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ తమకు పెను సవాల్ అని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పుకొచ్చారు.

తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు

జనవరి 25 – నామినేషన్ల స్వీకరణ
జనవరి 27 – నామినేషన్లకు తుదిగడువు
జనవరి 28 – నామినేషన్ల పరిశీలన
జనవరి 29 – నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
జనవరి 30 – అభ్యంతరాలపై తుది నిర్ణయం
జనవరి 31 – నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు
ఫిబ్రవరి 5 – పోలింగ్ తేది (ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 3:30 గటల వరకు)
ఫిబ్రవరి 5 – ఓట్ల లెక్కింపు (సాయంత్రం 4 గంటల నుంచి)