చట్ట సభను గౌరవించాల్సిందే.. ఆఖరి రోజున ఎస్ఈసీగా నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు..!

Wednesday, March 31st, 2021, 06:09:44 PM IST

ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవి కాలం నేటితో ముగియనుంది. నేడు ఆయనకు ఆఖరి రోజు కావడంతో మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈసీకి ఉండే అధికారాలను వినియోగించుకుని పని చేశాని, వేరే వారి పరిధిలోకి తానెప్పుడూ వెళ్లలేదని అన్నారు. చట్ట సభను ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందేనని, గవర్నర్ వ్యవస్థ పట్ల కూడా తనకు అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. ఎస్ఈసీ ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని అన్నారు.

అయితే ప్రభుత్వం సహకరించింది కాబట్టి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధ్యమైందని ఎన్నికల నిర్వహణ పట్ల నేను పూర్తి సంతృప్తిగా ఉన్నానని అన్నారు. రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుందని స్థానిక ఎన్నికల్లా కాకుండా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించామని నిమ్మగడ్ద చెప్పుకొచ్చారు. నా తర్వాత ఎస్ఈసీగా నీలం సాహ్నీ బాద్యతలు చేపట్టబోతున్నారని, ఎస్ఈసీ విధులు, బాధ్యతలపై ఆమెతో చర్చించానని అన్నారు. ఇక ఎస్ఈసీగా రిటైర్మెంట్ అవుతున్నాను కనుక నా ఓటు హక్కును సాధించుకునేందుకు న్యాయపోరాటం చేస్తానని నిమ్మగడ్డ అన్నారు.