బిగ్ న్యూస్: ఏపీ మంత్రి కొడాలి నానికి షాక్ ఇచ్చిన ఎస్ఈసీ..!

Saturday, February 13th, 2021, 01:00:33 AM IST


ఏపీ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. నేడు ఎస్ఈసీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరిన ఎన్నికల సంఘం ఆయన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంది. ఈ నెల 21 వరకు కొడాలి నాని ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదని, ప్రెస్‌మీట్‌లతో పాటు ఎలాంటి మీటింగ్‌లలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ మంత్రి కొడాలి నానిపై పర్యవేక్షణ చేయాలని సూచించింది.

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని రాష్ట్రంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీని అడ్డుకునేందుకు ఎస్ఈసీ, చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి వచ్చినా అడ్డుకోలేరని వీరంతా జగన్నాథరథ చక్రాల కింద నలిగిపోవడం ఖాయమని అన్నారు. అంతేకాదు వారిద్దరు ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాలని మంత్రి కొడాలి కామెంట్లు చేశాడు. అయితే మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

అయితే ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీస్‌కు మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవముందని ఎస్‌ఈసీని కించపరిచే ఉద్దేశం, ఆలోచన తనకు లేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీరుపై ప్రజల్లో జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే తాను ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల్లోని నిజమైన భావాన్ని ఎస్ఈసీ అర్ధం చేసుకోలేదని అన్నారు. కావున తాను చేసిన వ్యాఖ్యలను ఎస్ఈసీ మరోసారి పరిశీలించి షోకాజ్ నోటీసులు వెనక్కితీసుకోవాలని వివరణ లేఖలో మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.