మంత్రి కొడాలిపై ఎస్ఈసీ సీరియస్.. కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు..!

Saturday, February 13th, 2021, 04:12:31 PM IST

వైసీపీ మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ మరో షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఆయనపై ఐపీసీ 504, 505(1)(ఛ్), 506 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. ఎస్ఈసీనీ బెదిరించారనే అంశంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది.

నిన్న మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని ఎస్ఈసీనీ కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఎస్‌ఈసీ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరింది. అయితే ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీస్‌కు మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవముందని ఎస్‌ఈసీని కించపరిచే ఉద్దేశం, ఆలోచన తనకు లేదని అన్నారు. తన వ్యాఖ్యల్లోని నిజమైన భావాన్ని ఎస్ఈసీ అర్ధం చేసుకోలేదని కావున తాను చేసిన వ్యాఖ్యలను ఎస్ఈసీ మరోసారి పరిశీలించి షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని కోరారు.

అయితే మంత్రి కొడాలి నాని వివరణపై ఎస్ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో ఈ నెల 21 వరకు కొడాలి నాని ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదని, ప్రెస్‌మీట్‌లతో పాటు ఎలాంటి మీటింగ్‌లలో పాల్గొనకూడదని నిన్న రాత్రి ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఆయనపై ఎన్నికల ఉల్లంఘన కేసులు నమోదు చేయాలని ఎస్ఈసీ కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించింది.