స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి నిమ్మగడ్డ కౌంటర్..!

Thursday, December 17th, 2020, 06:46:36 PM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని, అయితే వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉందని ఈ సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

అయితే దీనిపై స్పందించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. కరోనా వ్యాక్సిన్ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉందని వాటికి ఇంకా క్లినికల్ అప్రూవల్స్ కూడా రాలేదని అన్నారు. అయితే వ్యాక్సిన్ రావడానికి ఇంకా మూడు నుంచి ఆరునెలల సమయం ఉందని, తొలి ప్రాధాన్యతగా ఒక వర్గానికి మాత్రమే వేయాలని అందరికీ కాదని కౌంటర్‌లో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పిటిషన్ ను డిస్మిస్ చేయాలని ఎన్నికల కమీషన్ కోర్టును కోరింది.

ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని, ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగబద్ధ సంస్థకు ఉన్న హక్కులను ఉల్లంఘిస్తోందని అన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని గతంలోనే సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని ఎన్నికల కమీషన్ గుర్తుచేసింది. ఏపీలో కరోనా తగ్గిందని స్కూల్స్, మాల్స్, థియేటర్లు తెరవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. పక్క రాష్ట్ర తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమీషన్ హైకోర్టుకు తెలియచేసింది.