బిగ్ డిసీషన్: దుబ్బాక ఉప ఎన్నికకు స్పెషల్ ఆఫీసర్ నియామకం

Wednesday, October 28th, 2020, 07:34:44 PM IST

దుబ్బాక ఉప ఎన్నికలో రాజకీయం మరింత వేడెక్కింది. అధికార టీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించుకుని ప్రత్యర్ధి పార్టీలకు బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, ఈ ఎన్నికలలో గెలిచి రానున్న ఎన్నికలలో తమదే అధికారం అని చెప్పుకోవాలని కాంగ్రెస్, బీజేపీ తహతహలాడుతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంటిలో నోట్ల కట్టలు లభ్యమవ్వడం, టీఆర్ఎస్ మరియు బీజేపీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది.

అయితే అధికార పార్టీ కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తూ, కేసులు పెట్టి వేధిస్తున్నారని ఇది రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకమని దీనికి కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని బీజేపీ కోరగా, మరోపక్క బీజేపీ, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వీటన్నిటిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది. తమిళనాడుకు చెందిన సీనియర్ ఐపీఎస్ సరోజ్ కుమార్‌ను లా అండ్ ఆర్డర్ స్పెషల్ ఆఫీసర్‌గా ఈ ఎన్నికపై సమీక్ష చేయనున్నారు.