నిమ్మగడ్డ ఒక ఫ్యాక్షనిస్ట్ లా వ్యవహరిస్తున్నారు

Wednesday, January 13th, 2021, 02:13:55 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజా పరిణామాల పై ప్రభుత్వం చీఫ్ విప్ సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయం పట్ల, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రవర్తించిన తీరు పట్ల విశాఖ రాజధాని అంశం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల నోటిఫికేషన్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టే హైకోర్టు తగిన తీర్పు ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆలయాల పై దాడులు ఆగిన వెంటనే ఎన్నికల వ్యవహారం తెరపైకి తేవడం అనుమానాలకు తావిస్తుంది అంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి పరోక్ష ఆరోపణలు చేశారు.

అయితే ఎన్నికల సంఘం కార్యకలాపాలకు పథకం ప్రకారం విఘాతం కల్పించారు అనే అభియోగాల కారణంగా సంయుక్త సంచాలకుడు జీవి సాయి ప్రసాద్ ను మరియు ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణి మోహన్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తొలగింపు ఉద్యోగులను బెదిరించే విధంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ఫ్యాక్షనిస్ట్ లా వ్యవహరిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక విశాఖ రాజదాని అంశం పై మాట్లాడుతూ, నాలుగు నెలల్లో విశాఖ కి రాజధాని తరలింపు ప్రక్రియ మొదలు కానుంది అని, అప్పటిలోపు కోర్టుల్లో తీర్పు అనుకూలంగా వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.