చంద్రబాబు గారూ…అమరావతి మీద దొంగ పోల్స్ పెడుతున్నారు – సజ్జల రామకృష్ణ రెడ్డి

Tuesday, August 25th, 2020, 11:50:50 PM IST


చంద్రబాబు నాయుడు పై మరొకసారి ప్రభుత్వ చీఫ్ విప్ సజ్జల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారూ, ఎన్నికలు జరిగి 14 నెలలు కూడా ముగియలేదు, మీరు గెలిచిన ఆ 23 చోట్ల కూడా మీ పేరు చెప్తే భగ్గుమంటున్నారు అని అన్నారు. అలాంటి మీరు అమరావతి పేరు మీద దొంగ పోల్స్ పెడుతున్నారు అని ఆరోపించారు. మీ టీవీ లు, మీ పేపర్లు, మీ వెబ్ సైట్ లలో పెట్టే పోల్స్ లలో ఫలితాలు ఎలా వస్తాయో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు.

అయితే రాజకీయం గా చివరి దశ లో ఉన్న మీరు ఇప్పటికీ అయినా కళ్ళు తెరవండి అని విమర్శించారు. ఈ పైశాచిక ఎత్తుగడలు మానేయండి అని అన్నారు. కుళ్ళు, కుతంత్రాలు విడిచి పెట్టండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ మీడియా తో కల్లబొల్లి కథనాలు వండి వార్చే పద్దతులు వదిలేయండి అని అన్నారు. విశాఖ, కర్నూలు నగరాల పై ద్వేషాన్ని చిమ్మకండి అని, అమరావతి సహ అన్ని ప్రాంతాల అభివృద్ధి కి మద్దతు ఇవ్వండి అని పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ కి అనుకూలంగా ఉన్న మీడియా కూడా చేసిన పోల్స్ లో అమరావతి కి ఎక్కువగా ఓట్లు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు.