షర్మిల కొత్త పార్టీకి వైసీపీ మద్ధతిచ్చే ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన సజ్జల..!

Tuesday, February 9th, 2021, 05:22:54 PM IST

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారన్న వార్తల నేపథ్యంలో స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల పెట్టబోయే పార్టీకి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, పార్టీ ఏర్పాటు పూర్తిగా షర్మిల వ్యక్తిగత నిర్ణయమని సజ్జల స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినకూడదన్న భావంతోనే వైసీపీని తెలంగాణలో విస్తరించలేదని సజ్జల చెప్పుకొచ్చారు.

అయితే కొద్ది రోజులుగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఈ క్రమంలో సీఎం జగన్ తో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు వద్దని వారించినా షర్మిల వినిపించుకోలేదని అన్నారు. అయితే కొత్త పార్టీ ఏర్పాటులో వచ్చే ఒడిదుడుకులు, ఒత్తిడులు మొదలైన అంశాలకు షర్మిలే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆ పార్టీకి వైసీపీ నుంచి ఎలాంటి మద్ధతు ఉండబోదని సజ్జల స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జగన్‌, షర్మిల మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని సజ్జల చెప్పుకొచ్చారు. కుటుంబ పాలన సాగుతోందన్న విమర్శలు వినబడకూడదనే షర్మిలకు ఎలాంటి పదవి ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో పాదయాత్ర చేసిన కారణంగా ప్రజల మద్ధతు ఉంటుందన్న నమ్మకంతోనే షర్మిల పార్టీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకుని ఉండవచ్చని సజ్జల అన్నారు.