విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించిన ఆర్పీ పట్నాయక్..!

Wednesday, March 10th, 2021, 02:21:38 AM IST


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని నిన్న కేంద్రం మరోసారి తేల్చి చెప్పడంతో ఏపీలో నిరసనలు మిన్నంటాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి. అంతేకాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.

అంతేకాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆర్పీ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు కూడా సంధించారు. లాస్ లో నడుస్తుంది కాబట్టి విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నాం అని కేంద్రం అంటుందని, అలాంటప్పుడు ప్రైవేట్ వాళ్ళు తీసుకుని లాస్ లో అయితే నడపరు కదా అని అన్నారు. అంతేకాదు లాస్ లో నడుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వగానే ప్రాఫిట్ లోకి వెళ్తుందంటే.. ఆ లాజిస్టిక్స్ ఏమిటో స్టడీ చేసి, వాటిని ఇంప్లీమెంట్ చేసే దిశగా కేంద్రం పని చేస్తూ కనీసం ఒకటి రెండు సంవత్సరాలు ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని అన్నారు. విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వాళ్ళకి ఒక సామాన్య పౌరునిగా రాజకీయ పార్టీలకు అతీతంగా నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు ప్రకటించారు.