అసెంబ్లీలో గళమెత్తుతానన్న రోజా!

Wednesday, December 17th, 2014, 09:35:17 PM IST

roja
ఆంధ్రప్రదేశ్ లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం నుండి ప్రారంభం కాబోతున్న నేపధ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా నేడు విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకముందు నుండే తాను మహిళలకు మద్దతుగా ఉన్నానని, ఈ అసెంబ్లీ సమావేశాలలో మహిళా సమస్యలపై మాట్లాడతానని తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చే వరకు తాము పోరాటం సాగిస్తామని రోజా స్పష్టం చేశారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హుధుద్ తుఫాను, రాజధాని, రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, అంగన్ వాడి సమస్యలు మొదలగు అంశాలపై అసెంబ్లీలో గళమెత్తుతామని తెలిపారు. అలాగే సమావేశాల సమయం తక్కువ ఉన్నప్పటికీ అన్ని సమస్యలను చర్చకు తెస్తామని రోజా హామీ ఇచ్చారు. ఇక సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని రోజా పేర్కొన్నారు.