కనకదుర్గమ్మ నవరాత్రులకు మంత్రమయ సుగంధాన్ని సమర్పిస్తున్న రోజా

Tuesday, October 13th, 2020, 08:00:55 AM IST

rk roja , puranapanda srinivas book

పురాణపండశ్రీనివాస్ కు అర్చక పండితుల మంగళాశీర్వచన ప్రశంస

విజయవాడ : అక్టోబర్ : 13

పూలచెట్టు విరబూసినట్టు ఒక్కొక్క పవిత్రాత్మకమైన పుస్తకంతో తెలుగు రాష్ట్రాలలో సంచలనాలు సృష్టిస్తూ అద్భుతమైన రచనా సొగసులతో మహాజైత్ర యాత్ర సాగిస్తున్న ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలమైన ఒక శ్రీలహరి ఈ శరన్నవరాత్రుల ఉత్సవాలలో చల్లనితల్లి కనకదుర్గమ్మ దివ్య సన్నిధిలో రెండువందల యాభై పేజీల శోభతో ఉచితంగా అందబోతోంది.

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సమర్పిస్తున్న ఈ దివ్యగ్రంధంలో అమ్మవారికి నిత్యం చేసే అర్చనా వైభవాలతో పాటు అనేక మంత్ర వైభవాలు చోటుచేసుకోవడం ఒక విశేషమైతే , వీటికి పవిత్ర సొగసుల భాషా లావణ్యంతో పురాణపండ శ్రీనివాస్ పసుపుకుంకుమల ముందుమాటలు అద్దడం మరొక ప్రత్యేక ఆకర్షణగా చెప్పక తప్పదు. తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక భావజాల పరీవ్యాప్తికి విస్తృతంగా నిస్వార్ధంగా రేయింబవళ్లు కృషిచేస్తున్న పురాణపండ శ్రీనివాస్ మహా గ్రంధాలకున్న ఆదరణ అసాధారణమని ఎందరో పీఠాధిపతులు , మఠాధిపతులు , పండిత ప్రకాండులు , సాంస్కృతిక సాహిత్య ఆధ్యాత్మిక సంస్థలు గొంతెత్తి చెప్పడం మనముందు కనిపించే సత్యం .

నగరి ఎమ్మెల్యే రోజా సుమారు వంద మంత్రమయ అంశాలతో సమర్పిస్తున్న ఈ గ్రంధం అమ్మవారి భక్తులపాలిట కల్పవృక్షమని ఇంద్రకీలాద్రి పండితవర్గాలు వర్ణిస్తున్నాయి. శ్రీ లలితాపరాభట్టారికా దేవి ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న ఈ మంచి గ్రంధంలో విష్ణు ,నారసింహ , శైవ , కాలభైరవ దివ్య అంశాలతో పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం చేసిన విధానం వేదపండిత ఆమోదయోగ్యంగా ఉందని వేదపండితులు సైతం ముందుగానే ప్రశంసించడం దుర్గమ్మ కటాక్షమేనని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ సురేష్ కుమార్ పేర్కొనడం గమనార్హం .

గత కొన్ని సంవత్సరాలుగా పురాణపండ శ్రీనివాస్ అద్భుత గ్రంధాలను ఇంద్ర కీలాద్రి నవరాత్రుల సందర్భంలో నందమూరి బాలకృష్ణ , ఆంద్ర బ్యాంకు , చందన బ్రదర్స్, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి వంటి ఎన్నో ప్రముఖ సంస్థలు భక్త బృందాలకు పంచుతూనే ఉన్నాయని, ఈ అపురూప గ్రంధాలకు స్పందన అనూహ్యమని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. గత సంవత్సరం ‘ దుర్గే ప్రసీద ‘ దివ్య గ్రంధాన్ని దుర్గమ్మ సన్నిధిలో ఆవిష్కరించి తానే స్వయంగా భక్తులకు పంచి అభినందనలు అందుకున్న రోజా ఈసారి కొంచం పెద్దసైజ్ గ్రంధాన్ని అందిస్తూ తన భక్తిని దుర్గమ్మ పాదాలకు తన్మయత్వంతో సమర్పించడం అభినందనీయమని వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు సైతం అభినందిస్తున్నారు . ఈ దివ్యగ్రంధం వెనుక నవదుర్గల మంగళచిత్రంక్రింద రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో తానున్న చిత్రాన్ని ముద్రించడం పట్ల రోజాపై రాష్ట్ర నాయకత్వం హర్షం ప్రకటిస్తోంది .

దుర్గమ్మ సన్నిధిలో ఆవిష్కరణ జరుపుకుంటున్న ఈ మనోహర గ్రంథ వేడుకలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సురేష్ కుమార్, చైర్మన్ స్వామినాయుడు రోజాతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు పాల్గొంటారని ఆలయవర్గాలు చెబుతున్నాయి. ఐదేళ్ల నాడు ఆంద్ర బ్యాంకు వారు సమర్పించిన , వారాహి చలన చిత్ర సంస్థ గత మూడు సంత్సరాలుగా అమ్మవారికి ఎంతో వినయ విధేయతలతో సమర్పించిన అపురూప మంగళ గ్రంధాలు కూడా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్దివ్య రచనా సంకలనాలే కావడం గమనార్హం. గత నాల్గు రోజులనాడు తిరుమలలో సుందరకాండ పారాయణలో మహా పండిత ప్రముఖులైన కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, ఆకెళ్ళ విభీషణ శర్మతో పురాణపండ శ్రీనివాస్ ఆవిష్కరింపచేసిన ఆర్షధర్మ గ్రంధాలు టీటీడీ పండిత అర్చకవర్గాలను సైతం ఎంత ఆకట్టుకున్నాయి మీడియా కోడైకూసిన్ది కూడా. పురాణపండ శ్రీనివాస్ నిర్విరామ కృషి వెనుక వున్న దైవ శక్తికి మనం సాష్టాంగ పడాల్సిందేనంటున్నారు ఆకెళ్ళ విభీషణ శర్మ.

ఇన్ని దేవాలయాలలో పురాణపండ శ్రీనివాస్ పుస్తకాలు దర్శనమివ్వడం ఆషామాషీ వ్యవహారం కాదని, ఆయన నిస్వార్ధ సేవ అద్భుతమని తెలుగు రాష్ట్రాల నలువైపులనుండీ ప్రశంసలు వర్షిస్తున్నా…… పురాణపండ శ్రీనివాస్ ఈ పొగడ్తలకు దూరంగా తన ఆర్షధర్మాన్ని తాను కొనసాగిస్తూనే వున్నారు. అంతా దుర్గమ్మ దయేనంటున్నారు ఇంద్రకీలాద్రి అర్చక పండిత ప్రముఖులు. నిజమే మరి.