వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్.. ఏ పార్టీకి ఎంత ఆస్తులు ఉన్నాయంటే?

Saturday, March 20th, 2021, 02:39:31 AM IST


మన దేశంలో జాతీయ పార్టీలు కొద్ది మాత్రమే ఉన్నా, ప్రాంతీయ పార్టీలు మాత్రం చాలానే ఉన్నాయి. అయితే “ది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్” అనే సంస్థ దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల ఆస్తుల వివరాలను వెల్లడించింది. దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా సమాజ్‌వాదీ పార్టీ నిలిచింది. ఆ పార్టీ ఆస్తుల విలువ రూ. 572 కోట్లు ఉన్నట్టు తెలిపింది. ఇక బీజేడీ రూ.232 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, అన్నా డీఎంకే రూ.206 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.

అయితే ఈ జాబితాలో మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మూడు పార్టీలు ఏపీ అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మరియు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌లు టాప్-10 ధనిక ప్రాంతీయ పార్టీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం టీడీపీ రూ.193 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలవగా టీఆర్ఎస్ పార్టీ రూ.188 కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూ.93 కోట్లతో ఎనిమిదో స్థానం‌లో నిలిచింది. ఇదిలా ఉంటే టీడీపీ ఆస్తుల విలువలో రూ. 115 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండగా, టీఆర్‌ఎస్ ఆస్తుల విలువలో రూ. 152 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇక ఇతర ఆస్తుల కేటగిరిలో రూ.79 కోట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగంలో నిలిచింది.