ఐటీఐఆర్ రాకపోవడానికి మంత్రి కేటీఆరే కారణం – రేవంత్ రెడ్డి

Friday, March 12th, 2021, 11:20:54 PM IST


తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఐటీఐఆర్ రాకపోవడానికి మంత్రి కేటీఆరే కారణమని అన్నారు. 2018 నుంచి పట్టించుకోకుండా తప్పును తమపై పెట్టుకుని ఇప్పుడు కేంద్రంపై నిందలు వేసి తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అసమర్థత వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని ఆరోపించారు.

అయితే తెలంగాణలో అలీబాబా అరడజను దొంగలు తయారయ్యారని, పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్ దందా పేరుతో అమ్మేస్తున్నారని అన్నారు. కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ ద్వారా భారీ దోపిడీ చేస్తున్నారని వీళ్ళు చేస్తున్న దోపిడీకి సహకరించడానికి సోమేశ్ కుమార్‌కు సీఎస్‌ హోదా ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసమే కేటీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్ధతు తెలుపుతున్నట్టు ప్రకటించారని, నిజంగా కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందే విశాఖ వెళ్లాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.