అందుకే కేసీఆర్ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు – రేవంత్ రెడ్డీ

Friday, May 14th, 2021, 03:00:08 AM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ తెలంగాణలోనే తయారవుతోందని ఇక్కడి అవసరం తీరాక బయట రాష్ట్రాలకు ఇస్తామని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం కరోనా కేసులను తగ్గించి చూపడం వల్లే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు, మెడిసిన్లు తక్కువగా పంపుతోందని అన్నారు.

అయితే తెలంగాణలోని కార్పోరేట్ ఆస్పత్రులన్నీ కేసీఆర్ బంధువులవేనని అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదని ఆరోపించారు. కరోనా నియంత్రణపై కేసీఆర్ ఇచ్చిన సలహాలను విని ప్రధాని మోదీ మెచ్చుకున్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని, ఇంకా నయ్యం ఢిల్లీకి పిలిపించి సన్మానం చేశారని చెప్పుకోలేదని ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ తయారీ చేస్తున్న రెండు కంపెనీల సాంకేతిక నైపుణ్యాన్ని ఇతర కంపెనీలకు ఇప్పించాలని, అప్పుడే అందరికీ వ్యాక్సిన్ వేగంగా అందుబాటులోకి వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. కరోనా వైద్యానికి ఉపయోగించే అన్నింటిపై జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.