తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Wednesday, February 17th, 2021, 03:00:25 AM IST


తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్ధతుగా పాదయాత్ర చేపట్టారు. అయితే పాదయాత్ర ముగింపు నేపథ్యంలో నేడు రంగారెడ్డి జిల్లా రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ జరిగింది. ఈ సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని అన్నారు.

అయితే తన పాదయాత్రతో ఉప్పెన సృష్టిస్తానని.. ఆ ఉప్పెనలో కేసీఆర్‌ను కప్పేస్తానని అన్నారు. పాదయాత్రకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి అనుమతి తీసుకుంటానని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను గొయ్యి తీసి పాతిపెట్టడానికే తన పాదయాత్ర అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడుదొంగలని, కేసీఆర్‌ను తప్పులు చూపి మోదీ లొంగదీసుకున్నారని . కానీ ప్రజల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ లొంగదీసుకోలేరని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.