జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం మరింత రసవత్తరంగా మారింది. ఇవి స్థానిక ఎన్నికలు కాదు దేశానికి ఎన్నికలు అనే విధంగా నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్పై తీవ్రంగా మండిపడ్డారు. బస్తీలకు గస్తీ కాసే వాళ్ళకి ఓటు వేయండి అని అన్నారు. ఆరేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని టీఆర్ఎస్ ఇప్పుడు మాయమాటలు చెబుతుందని అన్నారు.
అంతేకాదు బీజేపీ, ఎంఐఎం మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. స్థానిక సమస్యలపై, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురుంచి మాట్లాడకుండా విద్వేషాలు రెచ్చగొట్టేలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరోనా, వరదల సమయంలో పేదలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్కు మాత్రమే ఉందని, అభివృద్ధి జరగాలంటే హైదరాబాద్ ప్రజలు ఆలోచించి కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు.