టీపీసీసీ ఒక్కటే కాదు సీఎం అభ్యర్థి కూడా రేవంతే.. నిజమేనా?

Friday, August 14th, 2020, 07:16:04 AM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీనీ ఎదుర్కొని కాంగ్రెస్‌ను మళ్ళీ అధికారంలోకి తేవాలంటే రేవంత్ రెడ్డి లాంటి గళమెత్తే నాయకత్వం కాంగ్రెస్‌కి కావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే రేవంత్‌కి పీసీసీ కట్టబెట్టాలని హైకమాండ్ ఇంతకు ముందే ఓ నిర్ణయానికి వచ్చినప్పటికి పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న సీనియర్లు దానికి అడ్డుపడుతున్నారు.

అయితే గత రెండు మూడు రోజులుగా రేవంత్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా కూతురు ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ఖాయం చేశారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకొస్తే సీఎం నువ్వేనని రేవంత్‌కి ఆమె భరోసా ఇచ్చినట్టు చర్చ జరుగుతుంది. అయితే ఇలా రేవంత్ రెడ్డి ప్రచారం చేయిస్తున్నాడో లేక ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారో తెలీదు కానీ ఈ విషయంపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్రంగా మండిపడ్డారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో రేవంత్ రెడ్డి లాంటి నేతలను చూడలేదని, తాను కాబోయే సీఎం అంటూ అప్పుడే ప్రచారం మొదలుపెట్టాడని అన్నారు. మాలాంటి సీనియర్ నేతలపై సోషల్ మీడియాలో అడ్డగోలు కామెంట్స్ చేస్తున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి రేవంత్ అంతు తేలుస్తానని అంటున్నాడు.

ఇది కాసేపు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ బాగా యాక్టివ్ అయ్యారు. రాజస్థాన్‌ రాజకీయాలలో ఏర్పడిన సంక్షోభంలో సచిన్ పైలెట్‌తో మంతనాలు జరిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడంలో ఆమె కీలక పాత్ర పోశించారు. అంతేకాదు ఇక కాంగ్రెస్‌లో ప్రియాంక ముఖ్య భూమిక పోషించబోతోందని ఈ నేపధ్యంలోనే అన్ని రాష్ట్రాలలో ఇమేజ్ ఉన్న యువ నాయకులకు ఆమె కాంగ్రెస్ బాధ్యతలను అప్పచెప్పబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లను ప్రియాంక గాంధీ పరిశీలిస్తున్నారని అయితే కోమటిరెడ్డికి సెంట్రల్‌లో అవకాశం కలిపించి, రేవంత్ రెడ్డికి రాష్ట్ర పీసీసీ అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అసలు ప్రియాంక మదిలో రేవంత్ పేరు ఉందో లేదో తెలీదు కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు మాత్రం రేవంత్ పేరు అసలు మింగుడుపడడం లేదని మాత్రం అర్ధమవుతుంది.