వీహెచ్ వ్యాఖ్యలకు స్మూత్ కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. మ్యాటరేంటంటే?

Thursday, November 12th, 2020, 02:09:42 AM IST

దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వకుండా మూడో స్థానానికి పడిపోవడంతో ఇక ఆలస్యం చేయకుండా టీపీసీసీ చీఫ్‌ను మార్చాలన్న డిమాండ్ జోరందుకుంది. దీంతో మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రైతు పొలికేక సభను ఏర్పాటు చేయగా అందులో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ బీసీలకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని, అప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళుతుందని అన్నారు. దీంతో సభలో ఉన్న కొందరు రేవంత్‌ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. అయినప్పటికి వీహెచ్ వెనక్కి తగ్గలేదు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి టికెట్లు ఇవ్వొద్దని, పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

అయితే అదే సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి వీహెచ్ వ్యాఖ్యలకు స్మూత్‌గా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు కేసీఆర్, కేటీఆర్ వేసే ఎంగిలి మెతుకులకు అమ్ముడుపోతున్నారని అలాంటి వారిని ఏరివేయాలని అన్నారు. అంతేకాదు డిపాజిట్లు రాని నాయకుల పెత్తనం కాంగ్రెస్‌లో ఉండదని కేంద్రనాయకత్వం తేల్చి చెప్పిందంటూ వీహెచ్‌ను ఉద్దేశించి అన్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా చిత్తశుద్ధితో పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే నాయకులనే జనాలు గెలిపించుకుంటారని చెప్పుకొచ్చారు.