మామ స్వాతిముత్యం – అల్లుడు ఆణిముత్యం !

Saturday, December 13th, 2014, 01:42:49 PM IST

revanth-reddy
తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా తాండూరులో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వాతిముత్యమైతే, ఆయన అల్లుడు ఆణిముత్యమని ఎద్దేవా చేశారు. అలాగే కెసిఆర్ పేదల అజెండాను పక్కన బెట్టి దొరల అజెండాను అమలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ కెసిఆర్ అధికారంలోకి రాక ముందు దళిత, గిరిజనులకు డబుల్ బెడ్ రూం ప్లాట్లు నిర్మిస్తామని చెప్పారని, ఇప్పుడు వాటి సంగతి గాలికి వదిలేసి ట్యాంక్ బండ్ చుట్టూ వంద అంతస్తుల భవనాల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారని మండిపడ్డారు. అలాగే ప్రజల మనోభావాలు దెబ్బతినేలా తరాలుగా జరుగుతున్న సాంప్రదాయాన్ని తోసిరాజని, వినాయక నిమర్జనం హుస్సేన్ సాగర్ లో కాకుండా కృత్రిమ చెరువులో చెయ్యాలని చెప్పడం తగదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వాటర్ గ్రిడ్ పధకం కూడా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకేనని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.