కేసీఆర్ ఎప్పటికీ కేటీఆర్‌ను సీఎం చేయడు.. రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..!

Monday, January 25th, 2021, 06:02:20 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ పచ్చి అబద్దాలతో బ్రతికేస్తున్నారని, అబద్దాలు చెప్పడం సీఎం పదవికి అర్హత అని కేటీఆర్ అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులనే రంగులు మార్చి కేటీఆర్ అభివృద్ధి చేసినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అయితే 2019 తర్వాత కొడంగల్‌కు ఒక్క అభివృద్ధి పనిని కూడా మంజూరు చేయలేదని అన్నారు.

అయితే కేటీఆర్‌కు దమ్ముంటే పనులు మంజూరు చేసినట్టు పోలేపల్లి ఎల్లమ్మ మీద ప్రమాణం చేసి చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్‌ను అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. కేటీఆర్ గుంటకాడి నక్కలా సీఎం పదవి కోసం ఎదురు చూడాల్సిందేనని కేసీఆర్ ఎప్పటికీ కేటీఆర్‌కు సీఎం పదవి అప్పగించరని రేవంత్ జోస్యం చెప్పుకొచ్చారు. కొత్తగా మంత్రి పదవి కోరుకుంటున్న వారే కేటీఆర్ సీఎం అని అంటున్నారని చెప్పుకొచ్చారు.