బండి సంజయ్‌ని చంపేందుకు ప్రయత్నం చేశారు – ఎంపీ రేవంత్ రెడ్డి

Tuesday, October 27th, 2020, 04:34:27 PM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని చంపే ప్రయత్నం చేశారని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీకి తన వరకు వస్తే గాని టీఆర్ఎస్ అసలు స్వరూపం గురుంచి తెలియలేదని అన్నారు. అయితే బీజేపీలో కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయని చెప్పుకొచ్చారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేసినా మురళీధర్‌రావు, విద్యాసాగర్ రావు ఎందుకు పరామర్శించలేదని అన్నారు.

అయితే నిన్న జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి కలెక్టర్, సీపీని పిలిచి వివరణ అడిగే అధికారం ఉన్నా ఆ పనిచేయలేదని విమర్శించారు. అయితే డబ్బులుంటే ఆదాయ పన్ను శాఖ సోదాలు చేయాలి కానీ పోలీసులు సోదాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సెక్యూరిటీ ఇచ్చిన కేంద్రం తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్‌కి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని అన్నారు. గతంలో బండి సంజయ్‌ని కొట్టినప్పుడు పోలీసులపై చర్యలు తీసుకోలేదు కాబట్టే ఇప్పుడు చంపేందుకు ప్రయత్నించారని అన్నారు.