జగన్ సర్కార్‌కు షాక్.. ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట..!

Thursday, January 7th, 2021, 09:35:45 PM IST

ఏపీ హైకోర్టు జగన్ సర్కార్‌కు షాక్ ఇచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఏబీ వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన హైకోర్టు రెండు వారాల పాటు ఏ చర్యలు తీసుకోవద్దని స్టే విధించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం తనపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కుట్ర పన్నుతోందని, నాపై క్రిమినల్ కేసుపెట్టి త్వరలోనే జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపి, మళ్లీ నాపై సస్పెన్షన్ ఆర్డర్ విధించాలని కుట్ర పన్నుతోందంటూ ఆరోపణలు చేస్తూ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు లేఖ కూడా రాశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన రక్షణ పరికరాల కొనుగోళ్లలో తన అరెస్ట్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏబీ రెండు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు కోర్టుకు సెలవులున్న రోజుల్లో తనను అరెస్ట్ చేసి రెండు రోజులపాటు తనను కస్టడీలో ఉంచిన తర్వాత అదే కారణం చూపి తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు.