విడుదల కష్టాల్లో రంగస్థలం..?

Monday, October 30th, 2017, 04:46:40 PM IST

రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985 చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పల్లెటూరి నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో చరణ్ సరికొత్త లుక్ తో పాటు, నటనతో కూడా ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మొదట అంతా బాగానే జరిగిన ఇప్పుడు మాత్రం పరిస్థితులు అనుకూలించడం లేదు. షూటింగ్లో జాప్యం జరుగుతుండడం, మొదటగా విడుదల అనుకున్న సంక్రాంతికి పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కావడం వెరసి ఈ చిత్ర వాయిదాకు కారణంగా మారాయి. సంక్రాంతికి విడుదలవుతుందని మొదట చిత్ర యూనిట్ ప్రకటించింది. పవన్ సినిమా బరిలో నిలవడంతో డిసెంబర్ లోనే విడుదల అంటూ కొన్ని రోజుల పాటు ప్రచారం జరిగింది.

కానీ షూటింగ్ జాప్యం జరగడంతో ఈ చిత్రం వేసవికి మారిపోయింది. ఇప్పుడు మళ్లీ ముందుకు జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ లో అల్లు అర్జున్, మహేష్ ల చిత్రాలు విడుదల కాబోతున్నాయి. పోటీ సరైనది కాదని భావిస్తున్న నిర్మాతలు మరో కొత్త విడుదల తేదీ కోసం కసరత్తు చేస్తున్నారట. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చెర్రీ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు.