జగన్ సర్కార్‌కు షాక్.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసీ..!

Saturday, January 9th, 2021, 02:40:59 AM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమీషన్‌కు మధ్య నడుస్తున్న వివాదానికి ఒక్కసారిగా తెరపడింది. ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. నాలుగు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం జనవరి 23న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుండగా, జనవరి 27న రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్, జనవరి 31న మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్, ఫిబ్రవరి 4న నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్టు తెలుస్తుంది.

అయితే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడంతో ఏపీలో రేపటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఫిబ్రవరి 5న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 9న రెండోదశ, ఫిబ్రవరి 13న మూడోదశ, ఫిబ్రవరి 17న నాలుగోదశ ఎన్నికలు జరపనున్నట్టు తెలిపింది. అయితే ఆయా రోజులలో ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుందని ఈసీ వెల్లడించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయని, అంతేకాకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్న కారణంగా ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేలేమని చెప్పినా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం ప్రభుత్వానికి షాక్ ఇచ్చేటువంటి అంశమనే చెప్పాలి. మరి దీనిపై మళ్ళీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.