నేటిఏపి విశ్లేషణ : ‘గులాబీ’ ఎలా గుబాలించింది..!

Friday, May 16th, 2014, 08:00:26 PM IST


ఉత్కంఠగా ఎదురు చూసిన సార్వత్రిక ఫలితాలు వచ్చేశాయి. తెలంగాణలో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, అటు లోక్ సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఆధిపత్యం చెలాయించి.. మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. తెలంగాణలో విజయాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తంగా చూస్తే… సెంటిమెంట్ కు జనం జై కొట్టారు.

వాస్తవానికి ఎన్నికలంటే.. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయి. కానీ… తెలంగాణలో మాత్రం… తెలంగాణ సెంటిమెంట్ ప్రభావంతో.. ఈసారి వాటి ఊసే లేదు. తెలంగాణ ప్రజలు కూడా వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణ సెంటిమంట్ ను మొదటి నుంచి జనంలోకి బలంగా తీసుకువెళ్ళడంలో తిరుగులేని రీతిలో ముందుకు సాగిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎన్నికల్లో కూడా ఆ సెంటిమెంట్ ను మరింతగా పడించి.. జనం చేత ఓట్ల వర్షం కురిపించుకున్నారు. తెలంగాణ వచ్చినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదని.. జరగాల్సిందంతా ముందుందని కేసీఆర్ చెబుతూ వచ్చారు. తెలంగాణ సమస్యలన్నీ తీరలేదనీ, తేల్చుకోవల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయంటూ సెంటిమెంట్‌ను సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని, అందుకే తనను అధికారంలోకి తీసుకురావాలనే నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్ళగలిగారు.

స్థానిక పోరులో క్షేత్రస్థాయి నాయకత్వం లేకపోయినా.. పెద్దగా అనుకూల వాతావరణం లేకపోయినా… తెలంగాణ సెంటిమెంటు ఊతంతో జోరు కనబరచిన కేసీఆర్.. సార్వత్రిక ఫలితాల్లోనూ టీ సెంటిమెంట్ తో ఓట్ల పంట పండించుకున్నారు. తెలంగాణ అంటే టిఆర్ఎస్ అని.. టిఆర్ఎస్ అంటే తెలంగాణ అని.. అసలీ రెండూ ఒకదానికొకటి పర్యాయపదాలని జనం మదిలోనాటేలా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఫలితంగా మెజారిటీ స్థానాల్లో పార్టీని గెలిపించుకుని… తెలంగాణలో తొలి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాధాన్యతా భూమికను పోషించిన కేసీఆర్… తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాతా కూడా… తెలంగాణ సెంటిమెంట్ తో ఓటర్లను ఆకట్టుకొంటూ… టీఆర్ఎస్ ను మరింత బలంగా జనంలోకి తీసుకువెళితే… కాంగ్రెస్ దానికి భిన్నమైన రీతిలో వ్యవహరించింది. తెలంగాణ మేమే తెచ్చాం… మేమే ఇచ్చాం అంటూ… ప్రకటనలతోనే సరిపెట్టుకుంది. అయితే జనంలోకి వెళ్ళి… సెంటిమెంటు రాజకీయాన్ని పండించుకోవడంలో… జనం మూడ్ ను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమైంది. సోనియా, రాహుల్ గాంధీలతో ప్రచార సభలు నిర్వహించినా జనంపై పెద్దగా ప్రభావం చూపలేదు. మహిళా నేతను సీఎంని చేస్తామని రాహుల్ చేసిన ప్రకటన ఓటర్లను అంతగా కదిలించలేదు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో చేసిన గడియారాన్ని తన చేతికి చూడాలనే ఆకాంక్షను కూడా ఆయన వ్యక్తం చేశారు. దీన్నసలు జనం పట్టించుకోనే లేదు. ఇక తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిని నేనే అంటూ పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ ఘనంగా చెప్పుకున్నా.. అదేమీ పనిచేయలేదు. నిజామాబాద్ ఓటర్లు.. డీఎస్ ను దారుణంగా తిరస్కరించారు. నిజామాబాద్ అర్బన్ నుంచి రూరల్ కి మారినా.. ఆయనకు ఫలితం మాత్రం మారలేదు. గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య ఇలా మంత్రులు ప్రజల తిరస్కారానికి గురయ్యారు.

తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ తో పాటు కీలక భూమిక పోషించిన బీజేపీకి కూడా తెలంగాణ సెంటిమెంటును సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయింది. తమవల్లే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని బలంగా జనంలోకి తీసుకువెళ్ళడంలో విఫలమైంది. దేశమంతా మోడీ గాలి వీస్తోందని… కేంద్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని… ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే తెలంగాణ అభివృద్ధి తిరుగులేని రీతిలో సాగుతుందని బలంగా ప్రచారం చేయడంలో కూడా విఫలమైంది.

మొత్తంమీద.. ఈ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా పనిచేయగా.. ఆ సెంటిమెంటును అందరి అంచనాలకు మించిన రీతిలో కేసీఆర్ సద్వినియోగం చేసుకున్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని… తెంలగాణ కోసం బాగా కొట్లాడే నేత కేసీఆర్ ఒక్కరే అనే భావననను ప్రజల్లో బలంగా నాటుకునేలా చేయడంలో సక్సెస్ అయిన కేసీఆర్… ఎన్నికల్లో కూడా విక్టరీ సాధించారు.