ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేయాలి.. టీఆర్ఎస్ సర్కార్‌కు రియాల్టర్ల హెచ్చరిక..!

Friday, January 8th, 2021, 10:46:31 PM IST

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రియాల్టర్లు సరికొత్త డిమాండ్ వినిపించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ‌ని రియాల్టర్లు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రియాల్టర్లు తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ‌ను సజావుగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలని కోరారు.

అయితే రిజిస్ట్రేషన్లను ఆపే అధికారం ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై ఏదో ఓ నిర్ణయం తీసుకోక‌పోతే ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వ చర్యలపై నిలెదీస్తామని, వచ్చే అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించి తీరుతామని రియాల్టర్లు హెచ్చరించారు.