నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ..!

Tuesday, March 30th, 2021, 12:08:47 AM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నామినేషన్లకు రేపు చివరి తేదీ కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అందరికంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని ప్రకటించింది. అయితే జానారెడ్డి వంటి ముఖ్యనేతను ఎదురుకునేందుకు అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ముందు నుంచి తర్జనభర్జన పడ్డాయి. రేపు నామినేషన్లకు చివరి తేది కావడంతో నేడు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కే గులాబీ బాస్ కేసీఆర్ టికెట్ కట్టబెట్టారు.

అయితే టీఆర్ఎస్ బీసీ సామాజిక వర్గానికి టికెట్ కట్టబెట్టడంతో అదే సామాజిక వర్గానికి చెందిన అంజయ్య యాదవ్‌కు టికెట్ ఇవ్వాలని తొలుత ఈజేపీ భావించినట్టు వార్తలు వచ్చాయి. మరోపక్క గతంలో సాగర్‌లో పోటీ చేసిన నివేదితారెడ్డికే టికెట్ ఇవ్వవచ్చన్న ప్రచారం జరిగింది. అయితే ప్రచారంలో ఉన్న వీరి పేర్లు కాకుండా, ఎవరూ ఊహించని విధంగా బీజేపీ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ పనుగోతు రవికుమార్‌ నాయక్ పేరును ఖరారు చేసింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎస్టీల ఓట్లు 40 వేలకు పైగా ఉన్నాయి. వారి ఓట్లమీద నమ్మకంతోనే రవికుమార్‌ను బీజేపీ పోటీలో నిలిపినట్టు తెలుస్తుంది.