ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారు – రాములు నాయక్

Sunday, November 15th, 2020, 03:04:47 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకుడు రాములు నాయక్ మండిపడ్డారు. ఉద్యమ కారులను కేసీఆర్‌ మరోసారి మోసం చేశారని అన్నారు. పైరవీకారులకు ఎమ్మెల్సీ పదవుల్లో అవకాశం ఇచ్చారని తప్పుబట్టారు. కవిత ఎంపీగా ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చారని, మాజీమంత్రి నాయిని నరసింహారెడ్డి, అతని భార్య మరణానికి ప్రభుత్వమే కారణమన్నారు.

అయితే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ప్రతిసారి అన్యాయం చేస్తున్నారని, ప్రగతిభవన్‌లో పదవులు అమ్మబడును అనేలా సెలక్షన్ చేశారని అన్నారు. తన స్థానంలో మరో సమర్థుడైన గిరిజనుడు కనిపించలేదా? అని ప్రశ్నించారు. బీసీ, ఓసీల్లో ఉద్యమకారులు కనిపించలేదా అని నిలదీశారు. గ్రేటర్ హైదరాబాద్‌, వరంగల్ ఎన్నికల కోసమే ఎమ్మెల్సీలను ఎంపిక చేశారని, టీఆర్‌ఎస్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారిందని, ఎమ్మెల్యేలు అటెండర్లుగా మారారని ఎద్దేవా చేశారు.