తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రామోజీ గ్రూప్ భారీ విరాళం..!

Thursday, October 22nd, 2020, 03:02:54 PM IST

హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నగరం అతలాకుతలమయ్యింది. భారీ వర్షాల కారణంగా చెరువులు తెగి, నాళాలు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో పలు కాలనీలు జలదిగ్బందంలో ఉన్నాయి. అయితే రెండ్రోజులుగా వర్షం కాస్త తగ్గినా ఇంకా లోతట్టు ప్రాంతాలలో వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే వరదల బాధితులను ఆదుకునేందుకు దాతలు విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా అనేక మంది ప్రముఖులు, సినీ హీరోలు, దర్శక నిర్మాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత విరాళాలు అందిస్తున్నారు.

అయితే వరద బాధితులను ఆదుకునేందుకు తాజాగా రామోజీగ్రూప్ సైతం ముందుకొచ్చింది. వరద బాధిత సహాయార్థం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సీఎం రిలీఫ్ ఫండ్‌కి 5 కోట్ల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ చెక్కును రామోజీ గ్రూప్ సంస్థల ప్రతినిధి మంత్రి కేటీఆర్‌కి అందచేశారు. ఇక మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ కూడా 10 కోట్ల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించింది.