వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందన్న విషయం అవాస్తవం – రామ్మోహన్ నాయుడు

Thursday, March 25th, 2021, 09:38:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి పక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని పలు సమస్యల పై గళమెత్తిన తెలుగు దేశం పార్టీ నేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు మరొకసారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందన్న విషయం అవాస్తవం అంటూ చెప్పుకొచ్చారు. 2000-2015 మధ్యలో, 12,600 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది అని వ్యాఖ్యానించారు. అంతేకాక వరుసగా 13 సంవత్సారాలు 100 శాతం సామర్థ్య వినియోగాన్ని మించింది అంటూ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణంగా లాక్ డౌన్ అమలు లో ఉన్న సమయం లో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1.3 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేసింది అంటూ చెప్పుకొచ్చారు. గత మూడు నెలల్లో నికర లాభాలను ఆర్జించింది అంటూ రామ్మోహన్ నాయుడు తెలిపారు.

అయితే రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు గతంలో టీడీపీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఘాటు విమర్శలు చేస్తుండగా, మరికొందరు మాత్రం రామ్మోహన్ నాయుడు ఈ అంశాల పై పార్లమెంట్ లో వివరించడం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.