హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమయ్యింది. చెరువులు, నాళాలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలలోని చాలా కాలనీలు నీట మునిగాయి. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ పక్క వరద సహాయక చర్యలను ముమ్మరం చేస్తూనే, మరో పక్క వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.
అయితే ఇప్పటికే ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న అధికార పార్టీ నేతలపై ప్రజల నుంచి వ్యతిరేకత కనబడుతుంది. అనేక చోట్ల ఎమ్మెల్యేలపై, కార్పోరేటర్లపై ప్రజలు తిరగబడి నిలదీశారు. అయితే మంత్రి కేటీఅర్‌పై తాజాగా రామంతపూర్ వాసులు మండిపడ్డారు. భారీగా వర్షం కురవడంతో రామంతపూర్‌లో పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. అయితే అక్కడ పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్ళిన కేటీఆర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా తాము నీటిలో మునిగిపోయి ఇబ్బందులు పడుతున్నా కేటీఆర్ తమ కాలనీలోకి రాకుండా ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు రోడ్ల షో చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు.