బాబుపై నేరుగానే విచారణ?

Tuesday, June 9th, 2015, 09:09:07 PM IST


కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య మంగళవారం హైదరాబాద్ ఇందిరాభవన్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టిన కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉన్నట్లు సాక్షాధారాలతో సైతం రుజువైందని పేర్కొన్నారు. అలాగే చంద్రబాబును విచారించేందుకు అవినీతి నిరోధక శాఖకు గవర్నర్ అనుమతి అవసరం లేదని, నేరుగానే విచారించవచ్చని రామచంద్రయ్య వివరించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయన మానసిక ఆందోళనకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. అలాగే విభజన చట్టం ప్రకారం చంద్రబాబును విచారించమని గవర్నర్ ఏసీబీని ఆదేశించవచ్చునని రామచంద్రయ్య తెలిపారు. ఇక ఒక ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించడం విచారకరమని రామచంద్రయ్య నిప్పులు చెరిగారు.