కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటుంది.. రాసిపెట్టుకోండి – రాహుల్ గాంధీ

Thursday, January 14th, 2021, 05:39:41 PM IST

దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. తమిళనాడులోని మధురై జిల్లా అవన్యపురంలో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అక్కడ పర్యటిస్తున్న రాహుల్ జల్లికట్టును ఆసక్తిగా తిలకించారు. తమిళ హీరో, డీఎంకే నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ జల్లికట్టు వేడుకల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటుందని, తన మాటలను రాసిపెట్టుకోండని అన్నారు. కొందరు వ్యాపారవేత్తల కోసం కేంద్రం రైతులను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. కరోనా వేళలో సాధారణ ప్రజలకు ఏం చేశారని ప్రధాని మోదీనీ నిలదీశారు. అసలు మీరు దేశ ప్రజలకు ప్రధానా? లేక ఇద్దరు, ముగ్గురు వ్యాపారవేత్తలకా? అని ప్రశ్నించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు బలంగా పోరాడుతున్నారని, రైతుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఉంటుందని తెలిపారు.